దేశవ్యాప్తంగా ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిపాయల ధర రూ.200 పలుకుతుందంటే.. ఉల్లి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించలేక చేతులెత్తేశాయి. దీంతో ప్రజలు ఉల్లిపాయలను వాడడం మానేశారు. ఇక పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లతోపాటు రోడ్డు పక్కన టిఫిన్ బండ్ల వద్ద కూడా ఆనియన్ దోశ అనే మాటే మరిచిపోయారు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలకే ఉల్లిపాయలను విక్రయిస్తున్నా.. గొడవలు జరుగుతుండడంతో ఆ తొక్కిసలాటలలో ఎందుకులే అని జనాలు ఉల్లిపాయలను కొనడం మానుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా మరీ ఈ స్థాయిలో ఉల్లి ధరలు పెరిగేందుకు కారణాలు ఏమిటా.. అని ఒక్కసారి విశ్లేషిస్తే…
సాధారణంగా ప్రతి ఏటా వేసవిలో రైతులు పండించే ఉల్లిపంట వర్షాకాలం ముగిసే వరకు చేతికొస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రైతులు పంట వేశారు. కానీ అకాల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బ తిని ఉత్పత్తి తగ్గిపోయింది. గతేడాది మహారాష్ట్రలో 3.54 లక్షల హెక్టార్లలో ఉల్లిపంట పండితే ఈసారి మాత్రం 2.66 లక్షల హెక్టార్లలో మాత్రమే ఉల్లిని పండించారు. అందులోనూ వర్షాలు పడడం వల్ల పంట మరీ దెబ్బతింది. దీంతో మార్కెట్లో డిమాండ్ మేరకు ఉల్లి సరఫరా లేదు. ఈ క్రమంలో సహజంగానే ఉల్లి ధర పెరిగింది. అయితే రెండు నెలల కిందట కేజీ ఉల్లిని మహారాష్ట్రలో కేవలం రూ.15కే రైతులు అమ్ముకుని నష్టాలు చవిచూశారు. కానీ అప్పుడు వారి నుంచి ఉల్లిని కొనుగోలు చేసిన దళారులు, మధ్యవర్తులు, వ్యాపారులు మాత్రం ఆ ఉల్లిని నిల్వ చేసి రేటు పెరిగే వరకు ఉంచారు. దీంతో వర్షం వల్ల పడ్డ దెబ్బకు తోడు కొన్ని రోజులుగా ఉల్లిని నిల్వ చేయడంతో ఇప్పుడు ఉల్లికి కటకట ఏర్పడింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నా.. అవి జనాల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు ఉల్లి ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అయితే దళారుల వ్యవస్థను కట్టడి చేసి నిల్వ చేసిన ఉల్లిపాయలను బయటకు రప్పించేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే గానీ కొంత వరకు ఉల్లి ఘాటు తగ్గదు. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది..!