కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమ డెలివరీ సర్వీసులను గత కొద్ది రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అమెజాన్ సంస్థ తమ డెలివరీ సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాల్లో అమెజాన్ డెలివరీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ఏయే ప్రాంతాల్లో డెలివరీ సేవలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయో.. ఆ ప్రాంతాల లిస్ట్‌ను కూడా అమెజాన్ ప్రస్తుతం విడుదల చేసింది.
అమెజాన్ డెలివరీ సర్వీసులు ప్రారంభమైన ప్రాంతాల వివరాలు ఇవే…
* హైదరాబాద్
* బెంగళూరు
* భువనేశ్వర్
* గురుగ్రాం
* జైపూర్
* జంషెడ్‌పూర్
* లక్నో
* లూథియానా
* మొహాలీ
* మైసూరు
* పాట్నా
* రాయ్‌పూర్
కాగా పైన తెలిపిన ప్రాంతాల్లోని పలు ఎంపిక చేసిన పిన్ కోడ్లలోనే ప్రస్తుతం డెలివరీ సేవలను అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇక వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుని వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుందని అమెజాన్ తెలియజేసింది. అయితే ఇప్పటికే ప్రీపెయిడ్ విధానంలో చేసిన ఆర్డర్లను మాత్రమే ప్రస్తుతం ప్రాసెస్ చేస్తున్నామని.. అందులోనూ కేవలం నిత్యావసర వస్తువులను మాత్రమే వినియోగదారులకు ప్రస్తుతం డెలివరీ చేస్తున్నామని.. ఆ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో తాము సంబంధిత ప్రాంతాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని.. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. వినియోగదారులకు కావల్సిన నిత్యావసరాలను వారి ఇళ్లకే డెలివరీ చేస్తున్నామని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.