కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. నెల నెలా చెల్లించే ఇంటి అద్దె, బిల్లుల మాట దేవుడెరుగు. కనీసం పూట గడిస్తే చాలు.. అనుకునే పరిస్థితిలో ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. అయితే మరో వారం రోజు అయితే ఇక కుటుంబాలను ఆ కాస్తయినా నెట్టుకు రాలేని దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని తెలిసింది. ఈ మేరకు ఇండియన్ ఎకానమీ హౌస్ హోల్డ్ నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి.
లాక్‌డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటున్న 3వ వంతు ప్రజలకు రానున్న రోజుల్లో వనరుల కొరత ఏర్పడుతుందని సదరు సర్వేలో వెల్లడైంది. ఇక లాక్‌డౌన్ వల్ల నెలవారీ ఆదాయం భారీగా తగ్గిందని, నిరుద్యోగుల సంఖ్య కూడా 3 రెట్లు పెరిగి 25.50 శాతానికి చేరుకుందని తేలింది. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 34 శాతం మంది మరో వారం రోజులు గడిస్తే.. అసలు ఏమాత్రం కుటుంబాలను నెట్టుకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని.. ఆ సర్వేలో నిర్దారణ అయింది.
అయితే ప్రజలకు నేరుగా రేషన్ ఇవ్వడంతోపాటు నగదు పంపిణీ చేస్తే కొంత వరకు పరిస్థితి మారుతుందని సర్వేలో తేలింది. కాగా మార్చి 21 నుంచి మే 5వ తేదీ వరకు నిరుద్యోగం పెరగగా, కుటుంబాలకు వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది. ఇక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ (సీఎంఐఈ) చెబుతున్న లెక్కల ప్రకారం కరోనా వల్ల ఇప్పటికే 2.7 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వారంతా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న వారేనని తేలింది.