కరోనా మహమ్మారి బారిన పడ్డ వారికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని గతంలోనే సైంటిస్టులు చెప్పారు. అయితే ఇప్పుడు వారు చెప్పిన మాటే నిజమైంది. ఎందుకంటే.. కరోనా బారిన పడ్డవారికి సబ్ ఆక్యూట్ థైరాయిడైటిస్ (subacute thyroiditis) అనే వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుందని తేల్చారు. ఈ మేరకు సైంటిస్టులు తాజాగా ఓ అధ్యయనం కూడా చేపట్టారు.
కరోనా బారిన పడ్డవారికి సబ్ ఆక్యూట్ థైరాయిడైటిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ అనంతరం ఎగువ శ్వాసకోశ వ్యవస్థపై పడే ప్రభావం వల్ల ఈ థైరాయిడ్ వ్యాధి వస్తుందని వారంటున్నారు. ఈ మేరకు క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అనే జర్నల్‌లో సైంటిస్టులు తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. అనేక రకాల వైరస్ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ థైరాయిడ్ వ్యాధి వస్తుంటుందని, అయితే అది కరోనా వల్ల కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
కాగా కరోనా బారిన పడ్డ వారికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్వాసకోశ వ్యవస్థ ఎగువ భాగంలో ఉండే థైరాయిడ్‌పై ఆ ప్రభావం పడుతుందని, దీంతో పైన తెలిపిన వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన 18 ఏళ్ల ఓ యువతి ఆరోగ్యాన్ని సైంటిస్టులు పరిశీలించారు. ఆమెకు కరోనా వచ్చి తగ్గిన కొద్ది రోజులకు పలు భిన్నమైన లక్షణాలు కనిపించాయి. ఆమెకు మెడ, థైరాయిడ్ నొప్పి, జ్వరం, అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో సైంటిస్టులు ఈ విషయంపై పరిశోధన చేశారు. చివరకు ఆ వ్యాధి గురించి వివరాలను వెల్లడించారు. అయితే కరోనా సోకిన అందరికీ ఈ థైరాయిడ్ వ్యాధి వస్తుందని చెప్పలేమని, కానీ కొందరికి ఆ రిస్క్ ఉంటుందని వారంటున్నారు.