భారత్ లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. అయితే కరోనా కేసులు నమోదవుతున్న దాని కంటే రికవరీ అవుతున్న కేసులు ఎక్కువ ఉండడం ఒక్కటే ఏకైక ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 70,496 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది. గడచిన 24 గంటలలో 964 మంది వైరస్ కారణంగా చనిపోయారని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,152గా ఉందని ప్రకటించింది. ఇక అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 8,93,592 ఉన్నాయి. కరోనా వైరస్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారు 59,06,070 మంది ఉన్నట్టు బులిటెన్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చనిపోయిన వారు 1,06,490 మంది ఉండగా దేశంలో బాధితుల రికవరీ రేటు 85.52 గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 12.94 గా ఉంది.