వాట్సాప్‌లో ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొందరు పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇంకో ఫేక్ వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త కమ్యూనికేషన్ రూల్స్‌ను ప్రవేశపెట్టిందని, అందులో భాగంగానే వాట్సాప్, ఇతర ఫోన్ కాల్స్‌ను రికార్డు చేస్తున్నారని ఆ మెసేజ్‌లో ఉంది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా కొన్ని కమ్యూనికేషన్స్ రూల్స్‌ను అమలులోకి తెచ్చిందని, దీంతో వాట్సాప్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ కాల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టిందని, ఈ క్రమంలోనే కాల్స్‌ను రికార్డు కూడా చేస్తున్నారని, కనుక ఎవరూ రాజకీయాలు, మతాలు, ప్రభుత్వాలు వంటి అంశాలపై వార్తలను ప్రచారం చేయరాదని, చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆ మెసేజ్‌లో ఉంది. ఈ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ మెసేజ్‌లో ఎంత మాత్రం నిజం లేదని, కేంద్రం అలాంటి రూల్స్‌ను ప్రవేశపెట్టలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది. ఆ మెసేజ్ అబద్ధం అని దాన్ని ఎవరూ నమ్మకూడదని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. ఇలాంటి సమాచారం ఎవరికైనా లభిస్తే నమ్మవద్దని, వెరిఫై చేసుకోవాలని సూచించింది.