ఈజిప్టులోని “ది గ్రేట్ స్ఫింక్స్” ..? అంతుచిక్కని మిస్టరీలు

-

ది గ్రేట్ స్ఫింక్స్‌ను ఎప్పుడు నిర్మించి ఉంటార‌నే దానిపై పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికే ప‌లు అంచ‌నాలు వేశారు. వాటి ప్ర‌కారం.. ది గ్రేట్ స్ఫింక్స్‌ను క్రీస్తుపూర్వం 2575 – 2465 మ‌ధ్య కాలంలో అప్ప‌టి ఈజిప్టు రాజు ఖాఫ్రె నిర్మించార‌ని చెబుతారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత పురాత‌న‌మైన నాగ‌రిక‌త‌ల్లో ఈజిప్షియ‌న్ నాగ‌రిక‌త కూడా ఒక‌టి. క్రీస్తు పూర్వం 3150 సంవ‌త్స‌రానికి ముందే ఈజిప్షియ‌న్ నాగ‌రిక‌త ప్రారంభ‌మైంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌న‌ల్ని పురాత‌న ఈజిప్టుకు సంబంధించిన నిర్మాణాలు ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య ప‌రుస్తుంటాయి. అలాంటి నిర్మాణాల్లో ఒక‌టి పిర‌మిడ్లు కాగా.. మ‌రొక నిర్మాణం.. ఈజిప్టులోని గిజాలో ఉన్న ది గ్రేట్ స్ఫింక్స్‌.. దీన్ని ఎన్నో వేల సంవ‌త్స‌రాల కింద‌టే నిర్మించార‌ని పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు, చ‌రిత్రకారులు చెబుతుంటారు. కానీ కచ్చితంగా ఫ‌లానా సంవ‌త్స‌రంలో ది గ్రేట్ స్ఫింక్స్‌ను నిర్మించార‌ని చెప్పేందుకు ఎవ‌రి వ‌ద్దా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే కొంద‌రు చ‌రిత్ర‌కారులు, పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు, జియాల‌జిస్టులు మాత్రం.. ది గ్రేట్ స్ఫింక్స్‌ను ఏ సంవ‌త్స‌రంలో నిర్మించి ఉంటార‌నే దానిపై ఉజ్జాయింపులు వేసి ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ది గ్రేట్ స్ఫింక్స్ నిర్మాణంలో తల మ‌నిషిది, మిగిలిన భాగం మొత్తం సింహానిదిగా ఉంటుంది. ఇక ఈ జీవి శ‌య‌నిస్తున్న భంగిమ‌లో ఉంటుంది. ఈ క్ర‌మంలో ముందున్న పాదాల నుంచి వెనుక ఉన్న తోక వ‌ర‌కు దీని పొడ‌వు 73 మీట‌ర్లు (240 అడుగులు) ఉంటుంది. అలాగే ఎత్తు 20.21 మీట‌ర్లు (66.31 అడుగులు), వెడ‌ల్పు 19 మీట‌ర్లు (62 అడుగులు) ఉంటుంది. కాగా 1870వ సంవ‌త్స‌రంలో ది గ్రేంట్ స్ఫింక్స్ నిర్మాణంలో కేవ‌లం తల భాగం మాత్ర‌మే క‌నిపించేది. ఈ క్ర‌మంలో రాను రాను దాన్ని పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు త‌వ్వ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత కొన్ని సంవ‌త్స‌రాల‌కు ది గ్రేట్ స్ఫింక్స్ పూర్తి నిర్మాణం బ‌య‌ట ప‌డింది.

ది గ్రేట్ స్ఫింక్స్‌ను ఎప్పుడు నిర్మించి ఉంటార‌నే దానిపై పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికే ప‌లు అంచ‌నాలు వేశారు. వాటి ప్ర‌కారం.. ది గ్రేట్ స్ఫింక్స్‌ను క్రీస్తుపూర్వం 2575 – 2465 మ‌ధ్య కాలంలో అప్ప‌టి ఈజిప్టు రాజు ఖాఫ్రె నిర్మించార‌ని చెబుతారు. కానీ స్ఫింక్స్ త‌ల‌పై ఉన్న పెయింట్ గుర్తుల‌ను కార్బ‌న్ డేటింగ్ చేసిన పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు.. ఖాఫ్రె స్ఫింక్స్‌ను నిర్మించి ఉండ‌ర‌ని, అత‌ని క‌న్నా ముందు ఉన్న రెడ్జెడెఫ్ నిర్మించి ఉంటార‌ని, ఖాఫ్రె ఆ నిర్మాణానికి మ‌ర‌మ్మ‌త్తులు చేయించి ఉంటార‌ని చెబుతున్నారు. అందువ‌ల్ల స్ఫింక్స్‌ను 2575 క‌న్నా ముందే నిర్మించి ఉంటార‌ని ప‌లువురు పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఇక గ్రేట్ స్ఫింక్స్ నిర్మాణం కింది వైపు భారీగా వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు నీరు ప్ర‌వ‌హిస్తే ఏర్ప‌డే మేట‌ల్లాంటి ఆకృతులు కూడా ఉన్నాయి. కానీ స్ఫింక్స్ ఉన్న ఎడారి ప్రాంతంలో ఎన్నో వేల ఏళ్ల నుంచి వ‌ర్షం ప‌డ్డ దాఖ‌లాలు లేవు. మ‌ర‌లాంట‌ప్పుడు ఆ నీటి మేట‌లు ఎలా ఏర్ప‌డుతాయ‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. క్రీస్తు పూర్వం 10వేల ఏళ్ల‌కు ముందు ఉన్న మంచు యుగం (ఐస్ ఏజ్‌)లోనే స్ఫింక్స్ నిర్మాణ‌మై ఉంటుంద‌ని, అందుక‌నే అప్ప‌ట్లో వ‌ర్షం ప‌డిన‌ప్పుడు, మంచు కరిగిన‌ప్పుడు పెద్ద ఎత్తున స్ఫింక్స్‌పై నీరు ప్ర‌వ‌హించి ఉంటుంద‌ని, అందుక‌నే ఆ నీటి మేట‌లు ఏర్ప‌డ్డాయ‌ని ప‌లువురు చ‌రిత్రకారులు చెబుతున్నారు.

కాగా ది గ్రేట్ స్ఫింక్స్ ను క్రీస్తు పూర్వం 3వేల సంవ‌త్స‌రం అప్పుడు నిర్మించి ఉంటార‌ని కూడా కొంద‌రు చెబుతుంటారు. ఎందుకంటే.. క్రీస్తు పూర్వం 10వేల సంవ‌త్స‌రం అంటే.. అప్ప‌టికింకా మాన‌వ నాగ‌రిక‌త ప్రారంభం కాలేదు. క్రీస్తుపూర్వం 3100 నుంచి 3150 సంవ‌త్స‌రంలో మాన‌వ నాగ‌రిక‌త ప్రారంభ‌మై ఉంటుంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అలాంట‌ప్పుడు క్రీస్తు పూర్వం 10వేల సంవ‌త్స‌రానికి ముందు ది గ్రేట్ స్ఫింక్స్ ను నిర్మించే అవ‌కాశ‌మే లేద‌ని ప‌లువురు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో క్రీస్తు పూర్వం 3000 – 2700 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో ది గ్రేట్ స్ఫింక్స్ ను నిర్మించార‌ని కొంద‌రు భావిస్తున్నారు.

సాధార‌ణంగా చరిత్ర‌లో అప్పట్లో రాజులు లేదా ఇత‌రులు ఎవ‌రైనా ఏ నిర్మాణాన్ని అయినా నిర్మిస్తే దాన్ని ఎవ‌రు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు ? అనే వివ‌రాల‌ను శాస‌నాల రూపంలో ఆ నిర్మాణం వ‌ద్ద శిల్పాల‌పై చెక్కుతారు. కానీ ది గ్రేట్ స్ఫింక్స్ వ‌ద్ద ఇప్ప‌టికీ అలాంటి వివ‌రాలు ఏమీ పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌ల‌కు ల‌భించ‌లేదు. దీంతో ది గ్రేట్ స్ఫింక్స్ మిస్టరీ ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

అయితే గ‌త 28 ఏళ్ల కింద‌ట‌.. అంటే.. 1991 నుంచి 1993 మ‌ధ్య కాలంలో ఆంథోనీ వెస్ట్ అనే ఓ ఈజిప్టాల‌జిస్టు త‌న బృందంతో క‌ల‌సి ది గ్రేట్ స్ఫింక్స్ మిస్ట‌రీని ఛేదించాల‌ని య‌త్నించారు. అందులో భాగంగానే సీస్మోగ్రాఫ్, సోనార్‌వేవ్‌లతో ది గ్రేట్ స్ఫింక్స్ నిర్మాణం కింది వైపుకు కొన్ని మీట‌ర్ల లోతులోకి ప్ర‌త్యేక త‌రంగాల‌ను పంపి అక్క‌డ ఏమైనా నిర్మాణాలు లేదా నిధులు ఉన్నాయా… అనే వివ‌రాల‌ను తెలుసుకునేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ది గ్రేట్ స్ఫింక్స్ కింది భాగంలో కొన్ని మీట‌ర్ల లోతులో భారీ గ‌ది లాంటి నిర్మాణం ఉంద‌ని గుర్తించారు. కాక‌పోతే ఆంథోనీ పరిశోధ‌న అక్క‌డితోనే ముగిసింది. ఆ త‌రువాత ముందుకు కొన‌సాగేందుకు అత‌నికి ఈజిప్టు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో అనుమ‌తినివ్వ‌లేదు. దీంతో ది గ్రేట్ స్ఫింక్స్ మిస్ట‌రీని ప్రపంచానికి తెలియ‌జేయాల‌న్న ఆంథోనీ వెస్ట్ క‌ల నెర‌వేర‌లేదు. ఈ క్ర‌మంలో ది గ్రేట్ స్ఫింక్స్ ఇప్ప‌టికీ ఒక ర‌హ‌స్యంగానే మిగిలిపోయింది.

ఈజిప్టులో ది గ్రేట్ స్ఫింక్స్ ఒక్క‌టే కాదు.. ఇంకా అక్క‌డ అనేక చోట్ల చిన్న చిన్న స్ఫింక్స్ చాలానే ఉన్నాయి. కానీ వేటికీ లేని విశిష్టత ది గ్రేట్ స్ఫింక్స్ కు ఉంది. ఎందుకంటే దాని కింది భాగంలో ఉన్న భారీ గ‌ది లాంటి నిర్మాణంలో ఎంతో విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు, కొన్ని వేల ఏళ్ల కింద‌టి రాజుల వ‌స్తువులు, మాన‌వ నాగ‌రిక‌త ప్రారంభానికి సంబంధించిన విలువైన స‌మాచారం కూడా ఉంద‌ట‌. సాధార‌ణంగా అప్ప‌ట్లో ఈజిప్టు రాజులు భూగ‌ర్భంలో గ‌దుల‌లాంటి నిర్మాణాల‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు వాటిల్లో ఉంచే ఆభ‌ర‌ణాలు, వ‌స్తువుల‌కు ర‌క్ష‌ణ‌గా పై భాగంలో భూమి మీద స్ఫింక్స్‌ల‌ను ఏర్పాటు చేసేవారట‌. అందులో భాగంగానే భూగ‌ర్భంలోని గ‌దిలో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను కాపాడేందుకే ది గ్రేట్ స్ఫింక్స్‌ను అప్ప‌ట్లో రాజులు నిర్మించి ఉంటారని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. స్ఫింక్స్ అనేవి రాక్ష‌స జాతికి చెందిన జీవుల‌ని.. క‌నుక విలువైన వ‌స్తువుల‌కు అవి కాప‌లా ఉంటాయ‌ని భావించి వాటిని గ‌దుల‌ను ర‌క్ష‌ణ‌గా ఉంచేవార‌ట‌. అందుకే వాటిని పోలిన నిర్మాణాల‌ను భూగ‌ర్భ గ‌దుల‌పై నిర్మించేవార‌ట‌.

అయితే ది గ్రేట్ స్ఫింక్స్ మాత్రం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత పెద్ద‌వైన చారిత్ర‌క నిర్మాణాల్లో ఒక‌టిగా పేరుగాంచగా, అదొక చ‌క్క‌ని ప‌ర్యాట‌క కేంద్రంగా కూడా మారింది. ఆస‌క్తి ఉన్న ప‌ర్యాట‌కులు ది గ్రేట్ స్ఫింక్స్ ని సంద‌ర్శించ‌వ‌చ్చు. ఎన్నో వేల ఏళ్ల కింద‌ట నుంచి అనేక మాన‌వ నాగ‌రిక‌త‌ల‌కు సాక్ష్యంగా నిలిచిన ది గ్రేట్ స్ఫింక్స్ వ‌ద్ద ఉంటే మ‌న‌కు క‌లిగే అనుభూతిని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. క‌నుక మీకు కూడా ఆ భారీ నిర్మాణాన్ని చూడాల‌ని ఉంటే ఈజిప్టులోని గిజా వెళ్లి రండి మ‌రి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version