ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. దీంతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా డయాబెటిస్ వెన్నంటే వస్తున్నాయి. అయినప్పటికీ డయాబెటిస్ ముప్పును ఎవరూ గమనించడం లేదు. ముందుగానే పలు జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. ఇక ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు తమ జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే తాము తీసుకునే ఆహారంలో కింద సూచించిన పండ్లను చేర్చుకుంటే డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు తదితర పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి టైప్ 2 డయాబెటిస్‌ను అదుపు చేయడంలో బాగా పనిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవకాడోలలో ఉండే ఫైబర్ కూడా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఇక ఈ సీజన్లో అధికంగా లభించే నేరేడు పండ్లు కూడా డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తినడం లేదా.. ఆ పండ్లలో ఉండే విత్తనాలను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
పైనాపిల్, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ రసం, బొప్పాయి పండ్లు కూడా డయాబెటిస్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా పనికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కేవలం డయాబెటిస్ తగ్గడమే కాదు, పలు ముఖ్యమైన పోషకాలు కూడా మనకు లభిస్తాయి.