రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనకు ఎక్కడో ఒక చోట నిరాదరణకు గురైన వారు, ఎలాంటి ఆశ్రయం లేక భిక్షాటన చేసే వారు అనేక మంది కనిపిస్తుంటారు. కానీ వారి పట్ల సాధారణంగా ఎవరూ దయ చూపరు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనకు ఎక్కడో ఒక చోట నిరాదరణకు గురైన వారు, ఎలాంటి ఆశ్రయం లేక భిక్షాటన చేసే వారు అనేక మంది కనిపిస్తుంటారు. కానీ వారి పట్ల సాధారణంగా ఎవరూ దయ చూపరు. కనికరించే ఎవరో కొందరు మాత్రమే డబ్బులు లేదా ఆహారం దానం చేసి వెళ్లిపోతుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. కేవలం దానంతోనే సరిపెట్టుకోకుండా అంతకన్నా ఎక్కువగానే చేస్తున్నాడు. నిరాశ్రయులు, అనాథలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో చేర్పిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అతని పేరు డి.అరుణ్ రాజ్. తమిళనాడు వాసి. ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగి. కానీ అరుణ్ ఉద్యోగం కన్నా సమాజ సేవకే ఎక్కువ టైం కేటాయిస్తున్నాడని, ఉద్యోగం సరిగ్గా చేయడం లేదని అతన్ని జాబ్ నుంచి తొలగించారు. అయినా అతను బాధపడలేదు. సొంతంగా ఆటో కొనుక్కున్నాడు. అందులో నిత్యం 8 గంటల పాటు తిరుగుతూ రోడ్లపై నిరాదరణకు గురై, అనాథలుగా, యాచకులుగా కనిపించే వారిని ఆదరించి తన ఆటోలో తీసుకెళ్లి వారిని అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నాడు. అంతే కాదు, వారికి అవసరమైతే ముందుగా ప్రథమ చికిత్స అందించేందుకు తన ఆటోలో ఎప్పుడూ ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను తీసుకెళ్తుంటాడు. అలాగే బ్రెడ్, పండ్లు వంటి ఆహారాలు కూడా ఆటోలో ఉంటాయి. వాటిని ఆ నిరాశ్రయులకు ఇస్తుంటాడు.
అలా అరుణ్ 2016 నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తూ 320 మందిని అనాథాశ్రమాల్లో చేర్పించాడు. నిత్యం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అతను ఆటో నడుపుతాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారులపై తిరుగుతూ అనాథలను గుర్తించి వారికి సేవలు చేస్తాడు. ఈ క్రమంలోనే అరుణ్ తన సేవలను మరింత విస్తరించాలనే ఆలోచనతో కరుణై ఉల్లంగల్ ట్రస్ట్ పేరిట ఓ ఫేస్‌బుక్ పేజీ, ఒక యాప్‌ను ఏర్పాటు చేసి అందులో అనాథల వివరాలను తెలియజేయాలని ప్రజలను కోరుతున్నాడు. ఏది ఏమైనా అరుణ్ చేస్తున్న సేవకు అతనికి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!