దేవుళ్లు ఎక్కడో ఉంటారని, మనం ప్రార్థించే మాటలను వారు ఆలకించరని కొందరు అనుకుంటారు. కానీ సహాయం చేయాలంటే దేవుడే దిగి రావల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారికి ఎవరు సహాయం చేసినా సరే వారు దేవుడే అవుతారు. అవును.. ఆ డాక్టర్ కూడా సరిగ్గా ఇలా అనుకున్నాడో, లేదో తెలియదు కానీ.. ఏకంగా 200 మంది క్యాన్సర్ పేషెంట్లకు చెందిన రూ.4.75 కోట్ల బిల్లులను మాఫీ చేశాడు. వారి దృష్టిలో దేవుడయ్యాడు.
అమెరికాలోని అర్కన్సాస్‌కు చెందిన డాక్టర్ ఓమర్ అతిక్‌కు ది అర్కన్సాస్ క్యాన్సర్ క్లినిక్ ఉంది. దాన్ని ఆయన 29 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల క్రిస్మస్‌కు ముందు ఆయన తన క్లినిక్‌ను శాశ్వతంగా మూసివేశారు. కానీ 200 మంది పేషెంట్లకు చెందిన సుమారుగా 6.50 లక్షల డాలర్లు (దాదాపుగా రూ.4.75 కోట్లు) ఇంకా వసూలు కావల్సి ఉంది. అయితే ఆయన పెద్ద మనస్సు చేసుకుని ఆ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.
క్రిస్మస్ సందర్భంగా తన పేషెంట్లందరికీ స్పెషల్ కార్డులను ఆయన పంపాడు. అందులో వారు ఇకపై పెండింగ్‌లో ఉన్న తమ తమ బిల్లులను చెల్లించాల్సిన పని లేదని తెలిపాడు. దీంతో ఆయన చేసిన పనికి అందరూ ఆయన్ను మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు దేవుడు అంటూ ఆయనను కొనియాడుతున్నారు. అవును.. నిజంగా పేషెంట్ల దృష్టిలోనే కాదు, సామాన్య ప్రజల దృష్టిలోనూ ఆయన నిజంగా దేవుడే కదా.