ఒక బిలియనీర్ ప్రస్థానం మొదలైందిలా…

ఐకియా…. ఒక అంతర్జాతీయ కంపెనీ. వెంటనే అమర్చుకోగల ఫర్నిచర్, గృహోపకరణాలను స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసి అమ్ముతున్న సంస్థ. కనీసం 2008 నుంచి విడిగా ఫర్నిచర్ అమ్మడంలో ప్రపంచంలోనే నెం.1 కంపెనీ. 2017 నవంబర్ నాటికి 49 దేశాలలో 415 స్టోర్లను కలిగిఉంది. వాణిజ్యపరంగా  కలపను వినియోగించడం ద్వారా ప్రపంచం మీది మొత్తం కలపలో 1 శాతం ఐకియానే వాడుతోంది. ఫోర్బ్స్ ప్రపంచ టాప్ టెన్ కుబేరుల లిస్ట్‌లో స్థానం సంపాదించిన ఒక బిలియనీర్ ప్రస్థానం మొదలైందిలా…

17 యేళ్ల యువకుడు 1943 లో స్వీడన్ లో స్థాపించిన సంస్థ, IKEA. ఇలాంటి పేరొకటి ఏ వ్యాపారానికి పెట్టినట్లుగా వినలేదు. మొదటి రెండు అక్షరాలు అతని పేరు ఇంగ్వర్ కాంప్రాడ్ INGVAR KAMPRAD.  మూడవ అక్షరం అతను పెరిగిన వ్యవసాయ క్షేత్రంలో మొదటిది Elmtaryd. నాల్గవ అక్షరం అతను పుట్టిన ఊరు లోని మొదటి అక్షరం Agunnaryd. అన్నీ కలిపి “IKEA” గా పేరు పెట్టాడు.

బాగా బతికి చెడిన కుటుంబం. మూడు పూటలు తినటానికి అన్నం(బ్రెడ్.?) లేక …5 వ తరగతి చదివేటప్పుడే అగ్గి పెట్టెలు అమ్మేవాడు ఇంగ్వర్. అప్పట్లో అక్కడ ఒక అగ్గిపెట్టె కొంటే 25 పైసలు. ఇంగ్వర్ 200 అగ్గిపెట్టెలని టోకున 10 పైసల చొప్పున కొని తమ ఊర్లోని వారికి 15 పైసల చొప్పున అమ్మేవాడు. చౌక గా వస్తున్నాయని అందరూ ఇంగ్వర్ దగ్గరే కొనేవారు. చుట్టు ప్రక్కల ఊర్ల నుంచి కూడా జనాలు వచ్చి కొనేవారు. 6-10 తరగతి చదివే రోజుల్లో ఫ్రాన్స్ నుంచి 500 పెన్నులు, పెన్సిల్స్ టోకున కొని చాలా చౌక గా స్వీడన్ లో అమ్మేవాడు. 10 వ తరగతి పాస్ అయినందుకు తండ్రి 1000 క్రోనాలు (స్వీడన్ రూపాయలు) ఇచ్చి కొత్త ప్యాంట్ షర్ట్ లేదా సూట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే దానితో ” IKEA సంస్థ” ని స్థాపించాడు ఆ 17 యేళ్ల యువకుడు. అతను కాలేజీ చదువులు చదవలేదు, యూనివర్శిటీ మొహం చూడలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐకియా స్టోర్ – సియోల్, దక్షిణ కొరియా.

ఆ తర్వాత స్వీడన్ లోనే కాకుండా, నార్వే, ఫిన్ ల్యాండ్ మిగతా ఐరోపా దేశాలు, ఖండాల్లో కూడా ఐకియ స్థాపించాడు. కాలక్రమేణా దక్షిణ అమెరికా తప్ప మిగతా ప్రపంచం అంతా ఐకియ స్టోర్స్ వెలిశాయి. ఇంగ్వర్ కాంప్రాడ్ ప్రపంచంలోని టాప్ 10 సంపన్నులలో ఒకడు. కానీ, బస్‌లోనే ప్రయాణిస్తాడు. పాత వోల్వో కార్లోనే తిరుగుతాడు. తను ప్రతి రోజూ మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొంటాడు. యూరప్ లోని విమానాలు అన్నింటినీ కొనగలడు. కానీ, విమానంలో సాధారణ టికెట్ కొని ప్రయాణిస్తాడు. ఇలా ఎందుకు అని ఎవరైనా అడిగితే డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా అలాంటి పనులు నాకు ఆనందం వేయవు. మా కస్టమర్స్ ఎలా బ్రతుకుతున్నారో నేను అలానే బ్రతుకుతాను అంటాడు ఇంగ్వర్ కాంప్రాడ్.

తన ఫర్నీచర్ స్టోర్ లో లభ్యమయ్యేది అంతా కలప నుంచే కాబట్టి, తన వ్యాపారం వలన పర్యావరణానికి కీడు జరుగుతోందని అనిపించి 25 వేల ఎకరాలు కొని ఒక అడవినే పెంచాడు ఇంగ్వర్ కాంప్రాడ్.

IKEA ఫర్నీచర్ స్టోర్ లో ప్రతి 6 సెకండ్ల కి ఒక బుక్ షెల్ఫ్ అమ్ముడుపోతుంది. IKEA లో అత్యంత ఎక్కువు గా అమ్ముడు పోయేవి కూడా ఈ పుస్తకాల సొరుగులే. వినూత్నమైన డిజైన్లతో ఉపకరణాలు తయారు చేయడం, తన స్టోర్స్ అన్నింటినీ పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో నిర్మించడం వంటి వాటి ద్వారా వ్యయాలను తగ్గించుకుని, వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు లభించేలా చేయడం తన ప్రత్యేకత. దీన్నిలా కొనసాగించడంలో ఎటువంటి సమస్యలు రాకుండా అహరహం కష్టపడుతుంటాడు కాంప్రాడ్.

ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన ఐకియా స్టోర్.

బిలియనీర్ అయ్యాక కూడా సామాన్య జీవితం గడిపే పేదవాడు అని అతడ్ని ప్రపంచం అంతా అంటుంది. కానీ, సంపద లోనే కాదు, వ్యక్తిత్వం లో కూడా బిలియనీర్ అంటారు తెలిసిన వాళ్లు.