మంచి పైరులు మంచి పౌరులు ఉన్న నేలకు ఎప్పుడూ సౌభాగ్య సిద్ధి అన్నది ఉంటుంది. మంచి అనే లక్షణం పరివ్యాప్తిలో ఉన్నప్పుడు జీవితంలో కొత్త మార్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. అవన్నీ దేశాన్ని ముఖ్యంగా మానవ సమాజాన్ని మారుస్తాయి. ప్రగతి దిశగా నడిపిస్తాయి. కోనసీమ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే కాదు గత కొన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగానే ఉంటోంది. ఎవరో కొందరు బుద్ధిలేని పనులు చేసి వారి ప్రశాంతతకు భంగం తీసుకువచ్చారు. కోనసీమ ప్రజలు ఇప్పటి కన్నా ఇంకా మంచి అభివృద్ధి సాధించాలి. అంబేద్కర్ పేరిట కొందరు చేస్తున్న రాద్ధాంతాన్ని తిప్పికొట్టాలి. ఈ విషయమై ప్రజలకు సంయమనం అవసరం. రాజకీయం కాదు..కావాల్సింది.. మనుషులు సఖ్యతతో ఉండాలి. ఈ సందర్భంగా యువకులంతా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి! ఆ రోజు అంబేద్కర్ ఏమి ఆశించారు.
అంబేద్కర్ తన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఇచ్చారు. కులాలూ, మతాలూ అన్నవి కొట్లాట కోసం కాదు కదా ఉన్నవి. సామరస్య భావనలో భాగంగా మనుషులంతా ఉండాలి.ఇదే అంబేద్కర్ అనే మహనీయుడు కోరుకున్నారు. ఆయన బాగా చదువుకున్నారు. చదువుకు సంబంధించి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన చదువుకు భార్య కూడా ఎంతగానో సహకరించారు. స్వాతంత్ర్య సిద్ధి తరువాత కూడా అంబేద్కర్ పేదరికం అనుభవించారు. ఆర్థిక కష్టాలు అనుభవించారు. మనకు రాజ్యాంగం ఇచ్చేందుకు ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు.
న్యాయ శాస్త్ర అభ్యాసం అందుకు ఎంతగానో సహకరించింది ఆయనకు. ఆయన చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రశ్నించే నైజం పెంచుకోవాలని సూచించారు. మన జీవితాల్లో సహేతుక ప్రశ్నకు ఎంతటి విలువ ఉందో చాటి చెప్పారు. పాత అలవాట్లనీ, ఆలోచనల్నీ, ఆచారాల్నీ ఇలా ప్రతి ఒక్కదానిని ప్రశ్నించాలి. విద్యార్థులు ప్రతిరోజూ గురువును ఓ కొత్త ప్రశ్న అడగాలి. ఆ విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి. అలా అడిగే విధంగా మన విద్యా వ్యవస్థలు భావి పౌరులను ప్రోత్సహించాలి. ఇవీ అంబేద్కర్ మన నుంచి కోరుకున్నవి.