చాలామంది..తమకు ఉన్న బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. నిజానికి చచ్చే అంత ధైర్యం వచ్చిదంటే.. ఆ సమస్యలు పరిష్కరించడం పెద్ద కష్టం కాదు… కానీ నేడు ఎంతోమంది చిన్న చిన్న కారణాలేకే ప్రాణాలు తీసుకుంటున్నారు.. భర్త పెట్టే వేధింపులు తాళలేక.. ఆరేళ్ల క్రితం ఓ వివాహిత చనిపోవడానికి బావి దగ్గరకు వెళ్లింది.. సరిగ్గా దూకే టైంకు.. ఏడాది వయసున్నకొడుకు, తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు గుర్తొచ్చారు. అంతే వెనకడుగు వేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమే..సివిల్ పోలీస్ ఆఫీసర్ అయింది. సినిమా తీసేయొచ్చు ఈమె స్టోరీతో.. ఆడపిల్లకు ఉద్యోగం ఎంత అవసరమే ఈ పోలీసాఫీసర్ నౌజీష కథ ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. తన జీవితంలో పడ్డ ఆటుపోట్లు గురించి మనమూ చూద్దామా..! ఈ స్టోరీ కచ్చితంగా నేడు గృహహింసకు గురువుతున్న ప్రతిమహిళకు టచ్ అవుతుంది.
నౌజీషది కేరళ కోజికోడ్‌లోని ఓ గ్రామం. ఎంసీఏ వరకు చదువుకొని స్థానిక కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా చేరింది. ఇలా ఏడాది పాటు విధులు నిర్వర్తించిన ఆమెకు కుటుంభీకులు పెళ్లి చేశారు. వివాహం తర్వాత కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది.. ఇదే విషయం కాబోయే భర్త, అత్తమామలతో చెప్పగా.. వారూ అందుకు అంగీకరించారు. సంతోషంగా పెళ్లి చేసుకుంది.
మొదట్లో కొన్ని రోజులు అత్తింటి వాళ్లు ఆమెను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాతే వాళ్ల అసలు కారెక్టర్లు బయటపడ్డాయి. నిజానికి నౌజీష ఉద్యోగం చేయడం ఆమె భర్తకు ఇష్టం లేదు. ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటిదాకా తనతో బాగానే మెలిగిన తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక అయోమయంలోనే ఉద్యోగం మానాల్సి వచ్చిందామె.
ఉద్యోగం మానేసాక నౌజీషకు అసలు నిజం తెలిసింది.. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందట.. నౌజీష బయటకు వెళ్తే.. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని.. తనను వంటింటికి పరిమితం చేయాలన్నాడట. భర్తను ఈ విషయం అడిగిన ప్రతిసారి.. తనను హింసించేవాడట. ఏడాది పాటు అతడి ఆగడాలు భరించింది. పిల్లాడు పుట్టాక కూడా.. భర్త ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఇక ఈ కష్టాలు పడేలనేని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమైంది.
ఆ రాత్రి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి చేరుకున్నాక…కాళ్లూ, చేతులు వణకడం ప్రారంభించాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆ క్షణం తను కన్న బిడ్డ, తనని కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు, రాత్రింబవళ్లూ నేను కష్టపడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ గుర్తొచ్చాయి. అంతే.. నేనెందుకు చావాలి.. అంటూ అడుగు వెనక్కి వేసింది.. గుండె నిండా ధైర్యం నింపుకొని ఇంటికి చేరుకుందట. ఆ మరుసటి రోజే తన కొడుకుని తీసుకొని పుట్టింటికెళ్లిపోయిందట.
కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లిన నౌజీషకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్న నౌజీష.. విడాకుల కోసం అప్లై చేసింది. మరోవైపు లెక్చరర్‌గా తిరిగి ఉద్యోగంలో చేరింది. అంతలోనే ‘కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది.
ఓ వైపు ఉద్యోగం కొనసాగిస్తూనే.. మరోవైపు పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుని.. అయితే తొలి ప్రయత్నం (2018)లో రాత పరీక్షలో పాసైనా.. భౌతిక పరీక్షలో ఫెయిల్ అయింది. అయినా పట్టువదలకుండా 2020లో సక్సెసయ్యింది.. ‘విమెన్ సివిల్ పోలీస్ ఆఫీసర్స్’ జాబితాలో రాష్ట్ర స్థాయిలో 141వ ర్యాంక్ వచ్చింది.
‘కేరళ పోలీస్ అకాడమీ’లో ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకొని సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలందుకుంది నౌజీష. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేటింగ్ పరేడ్ పూర్తిచేసుకున్న అనంతరం తన కొడుకును గుండెలకు హత్తుకొని ఒకింత భావోద్వేగానికి గురైందామె. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆఫర్ లెటర్ అందుకున్న క్షణం.. తన కళ్లల్లో నీళ్లు తిరిగాయట.. ఒకప్పుడు భర్త టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లెంట్ ఇవ్వడానికి భయపడిన తను..ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయింది. నేడు ఎంతోమంది మహిళలు గృహహింసలను మౌనంగా భరిస్తున్నారు. అలాంటి వారికి అండగా ఉంటా అని నౌజీష తెలిపింది. 181 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేస్తే.. న్యాయం జరిగేలా చూస్తా అంటోంది.
పెళ్లే అనేది ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తుకు అడ్డుకాకుడదు. వైవాహిక జీవితంలో ఆనందం లేకపోతే.. సమాజానికి భయపడే, అమ్మానాన్నలు ఏమవుతారనో.. అక్కడే మగ్గిపోతూ కలలను నాశనం చేసుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. బయటపడితే.. జీవితం చాలా ఉంది. ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యం కాకూడదు. పెళ్లైందిగా.. ఇంకేం చేస్తాంలే అనే భావన నేడు చాలామందిలో ఉంది. స్వతంత్ర ఆలోచన ఉండాలి, సొంత ఆదాయ వనరు ఉండాలి. అప్పుడు అత్తింట్లోనూ, పుట్టింట్లోనూ గౌరవం ఉంటుంది అంటుంది మన నౌజీష. ఈమె కథ ఎంతోమంది మహిళలకు ధైర్యం ఇస్తుంది కదూ..!
-Triveni Buskarowthu