బ్యూటీ స్పీక్స్ : ఒక మగాడి క‌థ !  చాప్లిన్ టు చాప్లిన్

-

అజ‌రామ‌ర కీర్తికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడు ఒక‌డు.. ఆ విధంగా ఆ కీర్తి విస్తృతం అయ్యాక చచ్చాక కూడా తోడు ఉంటుంది. మ‌ర‌ణ కాలం త‌రువాత కొంత వ‌ర‌కూ ఆ కీర్తి సొంత మ‌నుషుల ఎదుగుద‌లకు సాయం చేస్తుంది. ఆ విధంగా చార్లీ చాప్లిన్ ఇప్ప‌టిదాకా కీర్తిని మోస్తున్నాడు. ఆయ‌న‌కు న‌కిలీ రూపాలు ఉన్నాయి కూడా ! కానీ ఆయ‌న మాత్ర‌మే ఎన్న‌టికీ ఒకే ఒక్క‌డు. అదే ఆయ‌న కీర్తిని కాస్త నిల‌దొక్కుకునేందుకు సాయప‌డింది. ఆ విధంగా చార్లీలో ప్ర‌తిభ అన్న‌ది కీర్తికి ఊతం ఇచ్చింది. న‌లుగురూ మెచ్చుకున్నా , అదే న‌లుగురూ నొచ్చుకున్నా, ఆయ‌నంత‌ట ఆయ‌నే త‌న ఉన్న ఊరిని వ‌ద్ద‌నుకున్నా అవ‌న్నీ సాధ్యం అయ్యాయి..కేవ‌లం ఆయ‌కున్న విల‌క్ష‌ణ రీతితోనే !

విషాదం నిండిన  జీవితం గురించి, విషాదం నుంచి తన‌ని తాను మార్చుకుని ఒంటరిగా మిగిలిపోయిన జీవితం గురించి అప్పుడెప్పుడో చెప్పిన విధంగానో రాసిన విధంగానో న‌వ్వులో కూడా విషాదం దాగి ఉంటుంద‌ని నేర్పిన జీవితం గురించి ఈ రోజు మాట్లాడుకుంటే ఈ వారాంతాన మాట్లాడుకుంటే ఎంతో బాగుంటుంది. ఆ విధంగా న‌వ్వు క‌న్నా ఏడుపు ఎక్కువ వ‌స్తుంది. దుఃఖం ను  మోసుకువ‌చ్చిన చావు క‌న్నా న‌వ్వుల‌నే మోసుకువ‌చ్చిన పుట్ట‌క విలువ తెలిసి వ‌స్తుంది. ఆ విధంగా మ‌న‌కు చాప్లిన్ అర్థం అయి ఉంటాడు. అర్థం అయ్యాక అత‌డు మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అనిపించుకుంటాడు కూడా!

చాప్లిన్ లో అందం మాట్లాడుతుంది. చాప్లిన్ అందం కాదు. గ‌మ‌నించ‌గ‌ల‌రు. నాట‌కీయ ప‌రిణామాలు మాట్లాడాయా? అంటే అత‌నిని క‌దిపితే నాట‌కం మ‌రియు నాట‌కీయ ప‌రిణామం త‌న‌ని ఏ విధంగా మార్చేయి అన్న‌వి వివ‌రిస్తూ వెళ్తాడు. ఆ విధంగా మ‌న‌కు చాప్లిన్ న‌చ్చి ఉంటాడు. మ‌న హీరోల‌కు రానంత మ‌న హీరోలు నేర్చుకుని తీరాల్సినంత, ఇంకా చెప్పాలంటే నియంత‌లే ఏడ్చినంత‌, ఇంకా చెప్పాలంటే అదే నియంతలే త‌మ‌ని తాము ఈస‌డించుకున్నంత చాప్లిన్ మ‌న‌కు న‌చ్చుతాడు. మురికి కాలువ‌ల ద‌గ్గ‌ర, నాట‌కం లేని రోజుల ద‌గ్గ‌ర, ప్ర‌ద‌ర్శ‌న‌లు లేక ఆక‌లితో ఉన్న రోజు ద‌గ్గ‌ర చాప్లిన్ అత్యంత ఇష్టంగా మ‌న‌కు న‌చ్చుతాడు.

చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు ఇవాళ. (ఏప్రిల్ 16) ఇంత‌కాలం అందం అంటే అమ్మాయి అన్న విధంగా రాసుకున్న బ్యూటీ స్పీక్స్ లో కాస్త మార్పు చేసి అందం అంటే అబ్బాయిల‌ది కూడా అనేంత‌గా మార్చుకుని రాసుకునేంత వ్య‌క్తిత్వం లేదా అభిన‌యం ఒక చాప్లిన్ కు మాత్ర‌మే సాధ్యం క‌నుక ఆయ‌న‌కు శుభాకాంక్షలు చెబుతూ.. రాస్తున్నానొక బ్యూటీ స్పీక్స్.

జీవితం ద‌గ్గ‌ర చిన్న‌వారు, మ‌రియు పెద్ద‌వారు అని ఎవ్వ‌రూ ఉండ‌రు. జీవితం ద‌గ్గ‌ర అంతా స‌మానం అయ్యే ఉంటారు. ఆ విధంగా ఉండడం వెనుక ర‌హ‌స్యాలు ఏమీ ఉండ‌వు. కానీ జీవితం తెరిచిన పుస్త‌కం క‌నుక ఆ పుస్త‌కంలో పేజీలు కొన్ని మాత్ర‌మే అయిష్టంగా ఉన్నా చ‌ద‌వాల‌నే ఉంటుంది. చ‌దివి తీరాలి కూడా!ఆ విధంగా వ్య‌క్తం అయిన వాటిల్లో చార్లీ చాప్లిన్ ఉన్నాడు. ఉంటాడు. లండ‌న్ లో పుట్టాడు. స్విట్జ‌ర్లాండులో జీవితం ముగించాడు. చార్లీకి ప్రేమ క‌థ‌లు ఉన్నాయి. చార్లీకి వాటితో విషాద అనుభ‌వాలు కూడా ఉన్నాయి. ఉంటే ఉండ‌నీ కానీ చార్లీని మించిన న‌టుడు ఇంకొక్క‌డు రాడు మ‌రియు రాలేడు కూడా !

– ర‌త్న‌కిశోర్ శంభుమహంతి

ఆర్ట్ : గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి 

Read more RELATED
Recommended to you

Exit mobile version