గడిచిన ఏళ్లలో ఎన్నడూ శ్రావణ మాసంలో చికెన్ ధరలు మరీ భారీగా తగ్గలేదు. కానీ ఈసారి మాత్రం చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి.
వారంలో ఉన్న ఏడు రోజుల్లో కొందరు ఒక దేవుడికి ఉపవాసం ఉంటే.. మరికొందరు మరొక దేవుడికి ఉపవాసం ఉండడమే కాకుండా, ఆ రోజు నాన్‌వెజ్ తినడం మానేస్తారు. మద్యం తాగరు. ఇక సంవత్సరంలో నెలల విషయానికి వస్తే.. శ్రావణ మాసంలో సహజంగానే అనేక మంది ఇండ్లలో పూజలు ఉంటాయి కనుక.. ఆ నెలంతా అనేక మంది నిష్టగా ఉంటారు. దీంతో మాంసాహారం దాదాపుగా ఎవరి ఇండ్లలోనూ వండరు. బయట తినేందుకు కూడా వారు విముఖత వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే ఈ నెలలో సహజంగానే చికెన్, మటన్ ధరలు తక్కువగా ఉంటాయి.
అయితే గడిచిన ఏళ్లలో ఎన్నడూ శ్రావణ మాసంలో చికెన్ ధరలు మరీ భారీగా తగ్గలేదు. కానీ ఈసారి మాత్రం చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300 పలికింది. కానీ ఇప్పుడది కేవలం రూ.160కి మాత్రమే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే చాలు.. చికెన్ అమ్మకాలు ఎలా తగ్గాయో మనకు తెలుస్తుంది. కాగా కేవలం హైదరాబాద్ నగరంలోనే ప్రతీ ఆదివారం ఏకంగా 12 లక్షల నుంచి 15 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుందని గణాంకాలు చెబుతుండగా శ్రావణ మాసం వల్ల చికెన్ కొనుగోళ్లు భారీగా తగ్గాయని పౌల్ట్రీ ప్రతినిధులు అంటున్నారు.
హైదరాబాద్ నగరంలో ఒక్కో చికెన్ దుకాణంలో ఆదివారం ఒక్క రోజే సుమారుగా 70 కేజీల నుంచి 80 కేజీల వరకు చికెన్ అమ్ముడవుతుందట. కానీ ప్రస్తుతం 50 కేజీలు అమ్ముడవడమే కష్టంగా ఉందని చికెన్ షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే మరోవైపు మాంసాహార ప్రియులు మాత్రం తగ్గిన చికెన్ ధరలతో పండగ చేసుకుంటున్నారు. ఇక శ్రావణమాసం అయిపోతే గానీ మళ్లీ చికెన్ ధరలు పెరిగే అవకాశం లేనందున అప్పపటి వరకు నాన్ వెజ్ ప్రియులకు పండగేనని చెప్పవచ్చు..!