ఈ నిద్ర ఏంటి.. రాత్రి పడుకుందాం అని బెడ్‌క్కితే..ఎంత ట్రై చేసినా రాదు.. కానీ మధ్యాహ్నం మాత్రం వద్దురా స్వామీ అన్నీ ఊగిపోతుంటాం..ఇంట్లో ఉంటే.. తినేసి పడుకోవచ్చు.. అడిగేవాడు ఉండడు.. కానీ ఆఫీసుల్లో అయితే అలా కుదరదు కదా..! లంచ్ బ్రేకే కనాకష్టంగా ఇస్తారు.. మళ్లీ తినేసి వచ్చాక ఆ సిస్టమ్ ముందు కుర్చుంటే.. నిద్రముంచుకొస్తుంది.. అస్సలు పని చేయదు.. మళ్లీ నాలుగు గంటలకు వచ్చే ఛాయ్ కోసం.. వంటిగంట నుంచే ఎదురుచూస్తాం.. మీకు ఇదే సమస్య. మధ్యాహ్నం ఆఫీస్‌లో నిద్రపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!
ఆఫీసులో భోజనం చేసిన తర్వాత శరీరానికి పని చేసే శక్తితో పాటు ఉత్సాహం ఉండదు. ఆ సమయంలో కాస్త నిద్రపోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎవరికైనా రోజంతా హ్యాపీగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే.. పని మీద శ్రద్ధపెట్టలేరు.. అందుకే రోజుకు 7-8గంటల పాటు నిద్ర తప్పనిసరిగా పోవాలి.
ఆఫీసుల్లో అయితే మధ్యాహ్న భోజనం లేదా నైట్ డ్యూటీలో డిన్నర్ తర్వాత వెంటనే మీ డెస్క్ దగ్గరకు వెళ్లకుండా..బయటికి వెళ్లి కాసేపు వాకింగ్ చేయాలి. ఇది నిద్రను దూరం చేస్తుంది. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తినేసి వెంటనే సిస్టమ్ ముందు కుర్చోకండి.. ఎలా అయినా లంచ్ బ్రేక్ 45- 60 నిమిషాలు ఉంటుంది. త్వరగా తినేసి.. కాసేపు ఆఫీస్ చుట్టు ఒక రౌండ్ వేసి రండి.
ఒక్కొక్కసారి అవసరానికి మించి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కళ్లు బరువెక్కుతాయి. కాబట్టి మీరు ఆఫీస్‌లో మితంగా తినాలి. మితంగానే నీరు తాగాలి. సెయింట్ లారెన్స్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయనంలో చూయింగ్ గమ్ అలసటను తగ్గిస్తుందని పేర్కొంది. ఇది అప్రమత్తంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అయితే చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. తిన్న తర్వాత పని చేస్తూ మీకు ఇష్టమైన పాటలను వినవచ్చు. ఇది అలసటను తొలగిస్తుంది. పని కూడా వేగంగా జరుగుతుంది.