మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా..? అయితే వెంటనే మానుకోండి. లేదంటే క్యాన్సర్ వస్తుంది. అవును, మేం చెబుతోంది నిజమే. ఇది అబద్ధం కాదు. గోర్లు కొరికే అలవాటు వల్ల ఓ యువతికి క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆమె ఇప్పుడు తన వేలును కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఇంగ్లండ్‌లోని సీవో డర్హమ్, న్యూటన్ అయిక్లిఫ్ అనే ప్రాంతంలో నివాసం ఉండే కోర్ట్నీ విట్‌హార్న్ అనే యువతి తన కుటుంబ సభ్యలతో 9 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. అయితే కోర్ట్నీకి గోర్లను కొరికే అలవాటు ఉంది. స్కూల్ వయస్సు నుంచే ఆమెకు ఆ అలవాటు ఉండేది.
ఈ క్రమంలోనే కోర్ట్నీ ఒకసారి తనను స్కూల్‌లో తోటి విద్యార్థులు ఏడిపిస్తున్నారని విపరీతమైన కోపం వచ్చి తన కుడి చేయి బొటన వేలి గోరును పూర్తిగా కొరికేసింది. దీంతో అక్కడ గాయం అయింది. తరువాత కొంత కాలానికి గాయం మానింది. గోరు మళ్లీ వచ్చింది. కానీ గోరు నల్లగా అయింది. ఈ క్రమంలో ఆమె ఒకసారి డాక్టర్ వద్దకు వేరే చికిత్స కోసం వెళ్లగా నల్లగా అయిన గోరును చూసి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు అరుదైన క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది.
పరీక్షలు చేసిన వైద్యులు కోర్ట్నీకి acral lentiginous subungual melanoma అనే ఓ రకమైన అరుదైన చర్మ క్యాన్సర్ సోకినట్లు తేల్చారు. కోర్ట్నీ గోర్లు కొరికినందువల్లే ఆ క్యాన్సర్ ఆమెకు వచ్చినట్లు నిర్దారించారు. దీంతో ఆమె ఒక్కసారిగా హతాశురాలైంది. అయితే ప్రస్తుతం వైద్యులు ఆమె గోరును మాత్రం పూర్తిగా తొలగించారు. మరిన్ని పరీక్షలు చేశాక, బొటన వేలిని కూడా పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. ఏది ఏమైనా.. గోర్లు కొరికే అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోండి. ఇతరులకు ఆ అలవాటు ఉంటే మాన్పించండి. లేదంటే చూశారుగా.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.