మహాభారతంలో పాండవులను వివాహామాడిన ద్రౌపది గురించి అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఎవర్ని అడిగినా ఆమె పాండవుల భార్య, ద్రౌపది వస్త్రాభరణం ఈ రెండు సీన్లు అయితే చక్కగా చెప్తారు కానీ. ద్రౌపది గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. ఆమె తన ఐదుగురు భర్తలతోను ఎలా కాపురం చేసేదో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో ఈరోజు మనం తెలుసుకుందాం.!
అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు.. తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా కుంతి పరధ్యానంలో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది. దీనితో.. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లాడుతారు. ఆ తరువాత కుంతి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయినా.. ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యతగా మెలిగేది.
వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది. ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు. ద్రౌపది కొన్ని నెలలపాటు ఒక్కొక్కరి దగ్గరా ఉంటూ వచ్చేది. ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదని అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారట.
ఓసారి ఓ వ్యక్తి అర్జునుడు వద్దకు వచ్చి కొందరు తన పశువుల్ని దొంగిలించారని తనని రక్షించాలని కోరతాడు. అయితే అర్జునుని విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. ఆ సమయంలో ద్రౌపది ధర్మ రాజు వద్ద ఉంటోంది. నియమం తప్పుతుందని తెలిసినా అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుని సమస్యను పరిష్కరించి ఆ తరువాత అరణ్యవాసం చేస్తాడట. అందుకే.. ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా ఏనాడు వారి మధ్య గొడవలు రాలేదు.
ద్రౌపది గురించి చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆమె అందరిలా తల్లి కడుపున పుట్టలేదు. యుక్తవయసు ఉన్న స్త్రీగా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెని యజ్ఞసేని అని పిలుస్తారట.
ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళేటపుడు ఆమె కన్యగానే వెళ్ళేది. అదెలా అనుకుంటున్నారా..? ఆమెకో వరం ఉంది. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయంలో ఆమె అగ్నిలోంచి నడిచేది. ఆ తరువాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్ళేది. ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడు నిండుగా ఉంచుకునేదట. ఎవరు వచ్చినా వండిపెట్టి కడుపునిండా భోజనం పెట్టేది.
ఆమె శ్రీకృష్ణుడిని తప్ప తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మేది కాదట. ఎందుకంటే శ్రీ కృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు కదా.. అప్పటి నుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది. విరాట రాజు కొలువులో కీచకుల వలన, నిండుసభలో కౌరవులు కూడా ఆమెను అపహాస్యం చేయడంతో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోయిందట.