ఆ దీవిలో ఒకే ఇల్లు.. కొనుక్కుంటే ఎంచ‌క్కా నివ‌సించవ‌చ్చు..!

-

చుట్టూ ఎటు చూసినా నీరు.. మ‌ధ్య‌లో చిన్న దీవి.. పచ్చ‌ద‌నం, ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం.. అలాంటి ప్ర‌దేశంలో ఉండేందుకు ఎవ‌రైనా ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే అలాంటి ఒక చిన్న దీవిలో ఉన్న ఒక ఇల్లును కొనుక్కునే అవ‌కాశాన్ని ఆ దేశం క‌ల్పిస్తోంది. ఆ ఇంటిని కొనుగోలు చేస్తే ఎంచ‌క్కా ఆ దీవిలో ఒక కుటుంబం మొత్తం ఉండ‌వ‌చ్చు. ఇంత‌కీ ఆ దీవి ఎక్క‌డ ఉందంటే..

నార్త్ వేల్స్‌లోని ఆంగ్లేసీకి దూరంగా ఉన్న ఒక చిన్న ద్వీపంలోని ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఆ ఇంటికి కేవలం ఒక పొరుగు కుటుంబం మాత్ర‌మే ఉంటుంది. అంటే ఆ ఇంటి ద‌గ్గ‌ర‌లో ఇంకో కుటుంబం నివ‌సిస్తుంద‌న్న‌మాట‌. ఆ ఇంటిని కొంటే వారు పొరుగువారు అవుతారు. ఇక ఆ ఇంటిని 9 ల‌క్ష‌ల పౌండ్ల‌కు (దాదాపుగా రూ.9.20 కోట్లు) విక్ర‌యిస్తున్నారు. అంత‌టి ధ‌ర పెడ‌తాం అనుకుంటే ఎవ‌రైనా స‌రే ఎంచ‌క్కా ఆ ఇంటిని కొని చ‌క్క‌గా ఆ దీవిలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో నివ‌సించ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం పెద్ద నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు నిశ్శబ్దంగా, ప్ర‌శాంతంగా, శుభ్ర‌మైన‌, పచ్చని వాతావ‌ర‌ణంలో నివ‌సించేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అందుక‌నే నార్త్ వేర్స్ లో అలాంటి ఇళ్ల‌ను ఎక్కువ‌గా విక్ర‌యిస్తున్నారు. ఇక ఇట‌లీలోని చిన్న చిన్న టౌన్‌లు, గ్రామాల్లోనూ ఇలాంటి ఇళ్ల‌నే విక్ర‌యిస్తున్నారు.

కాగా స‌ద‌రు ఇంటిని 1700వ సంవ‌త్స‌రంలో నిర్మించారు. త‌రువాత ఆ ఇంటికి ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే అందులో 4 రిసెప్షన్ గదులు, 5 బెడ్ రూములు, 2 బాత్రూమ్ లు, ఒక సన్ రూమ్, ఒక గార్డెన్ ఉన్నాయి. కిచెన్, యుటిలిటీ, స్ట‌డీ రూమ్‌, డిన్న‌ర్ రూమ్‌లు కూడా ప్ర‌త్యేకంగా ఉన్నాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే స‌ముద్రం మ‌ధ్య‌లో చిన్న దీవిలో ఉండే చిన్నపాటి ప్యాలెస్ అన్న‌మాట‌. ఇక ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేకంగా వాకింగ్‌కు ట్రాక్ ఉంది. పార్కింగ్‌కు గ్యారేజ్ ల‌భిస్తుంది. కాగా ఆ ఇంటిని ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో పర్పుల్‌బ్రిక్స్‌లో 9 ల‌క్ష‌ల పౌండ్ల‌కు సేల్ కు ఉంచారు. ఆస‌క్తి ఉన్నవారు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version