సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ అయ్యప్ప భక్తులు మహిళలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. శబరిమలకు 21కిలోమీటర్ల దూరంలో గల పతనంతిట్టలోని నీలక్కల్ వద్ద ఘర్షణాయుత పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలతో సహా పలువురు మీడియా వ్యక్తులపై కొంత మంది ముసుగులు వేసుకుని దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాధవి (45), ఆమె కుటుంబ సభ్యులను పంబ వద్ద అడ్డుకుని వెనక్కి పంపారు. సుప్రీం తీర్పుని అమలయ్యేల చర్యలు తీసుకుంటామని చెప్పి న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ దాడిలో రిపబ్లిక్ చానెల్‌కి చెందిన పూజా ప్రసన్న, న్యూస్ 18కి చెందిన రాధికా రామస్వామి, న్యూస్ మినిట్‌కి చెందిన సరిత ఎస్.బాలన్, ఎన్డిటివి స్నేహ కోశిలు గాయపడ్డారు. పోలీసులు వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి చేతులు దాటడంతో నీలక్కల్, పంబ, సన్నిధానం, ఎలవుమ్కల్ ప్రాంతాల్లో గురువారం 144వ సెక్షన్ విధించారని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ పి.వి.నూహ్ తెలిపారు. మహిళలను అడ్డుకుని దాడిచేసిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.