కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే… తెలుగు రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ విధించాయి. దీనిలో భాగంగా రాష్ట్రానికి ఉన్న అన్న బోర్డర్లను మూసివేశారు. అన్ని చెక్ పోస్టుల వద్ద రాకపోకలను నిలిపివేశారు. అయితే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లొచ్చని చెప్పడంతో ఒక్కసారిగా వారంతా ఏపీకి బయలుదేరారు. అయితే బోర్డర్ల వద్ద ఏపీ పోలీసులు మాత్రం వారికి అనుమతి నిరాకరించారు. మేము తెలంగాణ పోలీసులు అనుమతితోనే వచ్చామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వారిని అనుమంతించలేదు. దీంతో వారంతా బోర్డర్ల వద్దే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత కూడా ఏర్పడింది. విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తుండటంతో పోలీసులు వారిని అక్కడే నిలిపివేశారు. దీంతో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ ప్రభుత్వం ఎవ్వరినీ అనుమతించడం లేదని చెప్పడంతో వారంతా అక్కడే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మంత్రి కేటీఆర్ ఈ పరిస్థితిపై స్పందించారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ మాట్లాడారని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళుతున్న విద్యార్థులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.ఇప్పుడు ఆంధ్రా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్ లో హాస్టళ్ళను మూసివేయడం, ఆంధ్రా బోర్డర్లను కూడా మూసి వేయడంతో ఎక్కడి వెళ్ళాలో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు.