ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేయకుంటే కరెంట్ బిల్లులు చెల్లించ వద్దని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ మాటిచ్చాడని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయా శాఖల మంత్రులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , నటి విజయశాంతి కూడా ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తన ట్విట్లో కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపించమంటున్న ఎమ్మెల్యే కేటీఆర్.. కాళేశ్వరం దోపిడీ బిల్లులు కెసిఆర్ గారి ఇంటికి పంపాలని చెప్పాలని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఖజానా మొత్తం దోచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన విషయం పూర్తిగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ గ్యారెంటీల అమలు జరగవని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారని విజయశాంతి తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.