రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ దీప దాస్ మున్షి కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన విధంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ,భాజపా, మజిలీస్ పార్టీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారిని పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుంచి పోటీ చేయమని రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం శుభ పరిణామం అని అన్నారు.
అయితే ఈసారి సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తెలియదు గానీ ఒకవేళ గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనవరి మొదటి వారంలో తెలంగాణకు వెళ్తానని అలాగే ఇటీవల ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన అభ్యర్థుల అనుభవాలను పార్టీ ఉపయోగించుకునేలా చర్చలు జరుపుతామని తెలిపారు.