సంక్షేమ పథకాలుతోనే వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనే దిశగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అందుకే ఎలాంటి పరిస్తితులు ఉన్నా, అప్పులు చేసైన సరే చెప్పిన సమయానికి చెప్పినట్లుగా జగన్ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. ఇవే తనకు ఓట్లు రాలుస్తాయని భావిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు బటన్ నోక్కే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. అటు ఎమ్మెల్యేలని గడపగడపకు పంపి..సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమం చేస్తున్నారు.
అయితే తామే గొప్పగా పథకాలు అమలు చేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది..గతంలో ఈ పథకాలు ఎవరు అమలు చేయలేదని అంటున్నారు. కానీ అందులో వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. దాదాపు చాలావరకు పాత పథకాలు ఉన్నాయి..వాటికి కొత్త పేర్లు పెట్టారు. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం లాంటివి కొత్త పథకాలు..ఇంకా చాలా పథకాలు గతంలో అమలు అయినవే. అలాగే పలు పథకాల్లో కోతలు విధించిన పరిస్తితి కూడా ఉంది.
ఉదాహరణకు రైతు భరోసా గురించి చెప్పుకుంటే..ఎన్నికల సమయంలో జగన్ ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాతే కేంద్రం పిఎం కిసాన్ అంటూ రూ.6 వేలు ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చాక రెండు కలిపి రూ.18,500 రావాలి. కానీ జగన్ ప్రభుత్వం పిఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇస్తుంది రూ.7,500 మాత్రమే. ఇలా కొన్ని పథకాల్లో కోతలు ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా పెన్షన్ పథకం..అధికారంలో రాగానే రూ.2 వేలు కాస్త రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని పెంచుకుంటూ పోతామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టో కూడా అలాగే మార్చారు. అంటే రూ.250 పెంచుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం 2,500 ఇస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఇంకో 250 పెంచి, రూ.2,750 ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏడాది ఇంకో 250 పెంచి 3 వేలు చేసే ఛాన్స్ ఉంది. అంటే కరెక్ట్ గా ఎన్నికల సమయంలో పెన్షన్ దారులని ఆకట్టుకునేలా జగన్ స్కెచ్ ఉంది.
అయితే పెన్షన్ పెంచడం వల్ల..పెన్షన్ దారులు మొత్తం వైసీపీ వైపే ఉంటారా? అంటే డౌటే. ఎందుకంటే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ రూ.200 మాత్రమే. దాన్ని 1000 రూపాయిలు చేశారు. ఇక ఎన్నికలకు ఆరు నెలల ముందు 2 వేలు చేశారు. అయినా సరే ప్రజలు బాబుని నమ్మలేదు. కాబట్టి సంక్షేమమే కాపాడటం కష్టం.