పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో 1118 మీటర్ల పొడవున నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు.
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబ సభ్యులతో కలిసి పోలవరానికి చేరుకున్నారు. సీఎం కుటుంబ సభ్యులు అమరావతి నుంచి హెలికాప్టర్లో పోలవరం చేరుకున్నారు. పోలవరం గ్యాలరీ పూర్తైన సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించి ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
అంతర్భాగంలో గల గ్యాలరీ వాక్ లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏసీలు, కాంతి వంతమైన లైట్లను, వైద్యులను అందుబాటులో ఉంచారు.
రాష్ట్ర సీఎంతో సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో వెయ్యి మంది గ్రేహౌండ్స్, సీఆర్ఫీఎఫ్ దళాలు తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్న అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 2000 మంది పోలీసు బందోబస్తుని పోలవరంలో ఏర్పాటు చేశారు. సీఎం మనవడు దేవాన్ష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.