తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.
ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశాక.. కొత్తగూడెం-పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.వృక్ష పరిచయ క్షేత్రాన్ని సైతం ప్రారంభించారు.వైల్డ్ లైఫ్ సఫారీ,ఎఆర్‌వీఆర్ బిల్డింగ్‌లను కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఆ తర్వాత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన వాహనాలను ప్రారంభించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎం స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.