గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలాల సంరక్షణే కాకుండా విపత్తుల నిర్వహణపై కూడా హైడ్రా పనిచేస్తుంది. ఇకపై ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ఆర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా స్పష్టంచేసింది.కాగా,ఇటీవల బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కు స్థలం కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. ఆయన వెంటనే స్పందించి పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లు తేల్చి చర్యలకు దిగారు.పార్కును కాపాడినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి తర్వాత చర్యలు చేపట్టనున్నారు.