ప్రకృతిని ప్రేమిస్తూ కలిసి బతికేవాడే రైతు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… అమ్మ తర్వాత అంత గొప్ప మనసు రైతుకు మాత్రమే ఉంటుందని, రైతు అభివృద్దే దేశాభివృద్దిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ‘రైతునేస్తం’ పురస్కారాలను వెంకయ్యనాయుడు అందజేశారు. తనకు అత్యంత ఇష్టమైన శాఖ వ్యవసాయం, గ్రామీణాభివృద్ది అని వివరించారు. శాస్త్రవేత్తల పరిశోధనలు క్షేత్ర స్థాయి రైతు చెంతకు వెళ్లాలని ఆకాంక్షించారు.
దేశంలో లాభసాటి వ్యవసాయంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్శిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావుకు ఐవీ సుబ్బారావు, డాక్టర్ ఖాదర్ వలీకి జీవిత సాఫల్య పురస్కారాలను వెంకయ్య నాయుడు ప్రదానం చేశారు. వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నపలువురు అధికారులు, శాస్త్రవేత్తలు, పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. భవిష్యత్ తరాల్లో వ్యవసాయం ప్రధాన లాభసాటి వృత్తిగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.