మరోసారి కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లింది. దుండగుడు న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం సైనికుడి దుస్తుల్లో ఉన్న 18 ఏండ్ల యువకుడు టాప్స్ ఫ్రెండ్లీ సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు. అందులో ఉన్న వారిపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో పదిమంది దుర్మరణం చెందారని వెల్లడించారు అధికారులు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు.
కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందన్నారు. కాల్పుల ఘటనకు జాతివిద్వేషమే కారణంగా భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో ఎక్కువగా నల్లజాతీయులే ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఈ మధ్యే రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడని, అతడు ప్రస్తుతం సూపర్‌మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని చెప్పారు. నిందితుడు కాల్పుల ఘటనను హెల్‌మెట్‌కు అమర్చిన కెమెరాతో లైవ్ స్ట్రీమ్ చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.