కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌కు పెద్ద పరీక్షే ఎదురైందా? ఆయన తన సొంత నియోజకవర్గం శింగనమలలో పట్టు కోల్పోతున్నారా? ఎవరికి వారు ఇక్కడ పెత్తనం చేస్తుండడం.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దూకుడు పెంచడం వంటివి సాకేకు ఇబ్బందిగా మారిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైఎస్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సాకే శైలజానాథ్ 2004, 2009 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గమైన అనంతలోని శింగనమల నుంచి విజయాలు కైవసం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రెండు సార్లు విజయం సాధించినా.. ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్‌ను సొంతం చేసుకోలేక పోయారు.
పార్టీ తరఫునే ఆయన వాయిస్ వినిపించారు తప్ప.. ఫైర్ బ్రాండ్‌గా కానీ, నియోజకవర్గంలో ఆల్టర్నేట్-అల్టిమేట్ అనేవిధంగా కానీ.. సాకే గుర్తింపు సాధించలేక పోయారు. ఫలితంగా తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో 2014, 2019లో వరుస పరాజయాలు మూటగట్టుకున్నారు. ఇక, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ రాష్ట్ర సారధిగా ఉన్నారు. పట్టుతప్పిన పార్టీని లైన్లో పెట్టే బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సొంత నియోజకవర్గంలోనే సాకేకు మద్దతుగా నిలుస్తున్నవారు లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో టీడీపీ ఇక్కడ ఆధిపత్య ప్రదర్శించింది.
శమంతకమణి, ఆమె కుమార్తు యామినీ బాల దూకుడుతో కాంగ్రెస్ ఇక్కడ నష్టపోయింది. ఇక, గత ఎన్నికల్లో విజయం సాధించిన జొన్నలగడ్డ పద్మావతి మరింత దూకుడు పెంచి.. టీడీపీని, కాంగ్రెస్‌ను కూడా లేకుండా చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ తరఫున జెండా మోసే నాయకుడు లేకుండా పోవడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గాడిలో పెడతానని చెబుతున్న సాకేకు.. సొంత నియోజకవర్గంలోనే పార్టీని నిలబెట్టుకునే అవకాశం లేకుండా పోవడం .. పట్టుమని ఓ వంద మందిని తన వెంట తిప్పుకొనే పరిస్థితి లేకుండా పోవడం వంటివి ఇబ్బందిగానే మారాయని అంటున్నారు.
ఏ పార్టీకైనా.. పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహించే నేతల నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు వారి వారినియోజకవర్గాల్లో మంచి పట్టున్న విషయం ప్రస్థావనకు వస్తోంది. ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. వారి వారి నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఎక్కుతున్నారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి సాకేకు ఉంటుందా? వచ్చే ఎన్నికల నాటికి ఆయన పరిస్థితి ఏంటి? వ‌్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటారా? ఇవన్నీ.. కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.