తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త చెప్పింది. జూన్ మొదటి వారం తరువాత పరీక్షలను నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చింది. కరోనా కారణంగా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను నిర్వహించకూడదని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. కానీ ప్రస్తుతం ఆంక్షలను సడలిస్తుండడంతోపాటు తెలంగాణలో కరోనా కంట్రోల్‌లోనే ఉందని, కనుక 10వ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్ని మంగళవారం విచారించిన హైకోర్టు పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
అయితే జూన్ 3వ తేదీన రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి జూన్ 4న నివేదిక ఇవ్వాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అప్పటి వరకు తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గితే జూన్ 8వ తేదీ తరువాత పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఇక పరీక్షలు నిర్వహించాల్సి వస్తే.. ఒక ఎగ్జామ్‌కు, మరొక ఎగ్జామ్‌కు నడుమ కనీసం 2 రోజుల గ్యాప్ ఇవ్వాలని కోర్టు సూచించింది. అలాగే పరీక్ష సెంటర్ల వద్ద కరోనా జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.
కాగా తెలంగాణలో మార్చి 19వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా కేవలం 2 సబ్జెక్టులకు గాను 3 పరీక్షలు మాత్రమే జరిగాయి. ఈ క్రమంలో కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. అందులో భాగంగానే కోర్టు పైన తెలిపిన విధంగా సూచనలు చేసింది. ఈ క్రమంలో జూన్ రెండో వారంలో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు కచ్చితంగా తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.