విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటనపై హైపవర్ కమిటీ సోమవారం సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ నాలుగువేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్ రావుతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. కాగా, విశాఖలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7న వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.