సౌదీ అరేబియాలో ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పొరపాటు చేసినా కఠిన ఆంక్షలు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే.. డ్రగ్స్ కేసుల్లో సౌదీ అరేబియా పది రోజుల్లో 12 మందికి మరణశిక్ష విధించింది. వారందరినీ కత్తితో తలలు తెగనరికి శిక్ష అమలు చేసింది. సౌదీలో ఇలాంటి శిక్షలు విధించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. మరణ శిక్షలను తగ్గిస్తానని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హామీ ఇచ్చినప్పటికీ పది రోజుల్లో 12 మందికి మరణ దండన విధించడంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాన్-వయోలెంట్ డ్రగ్స్ ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితులకు మరణశిక్ష విధించడం గమనార్హం. శిక్షకు గురైన వారిలో ముగ్గురు పాకిస్థాన్, నలుగురు సిరియా, ఇద్దరు జోర్డాన్, ముగ్గురు సౌదీ అరేబియాకు చెందిన వారు.
వీరితో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 132 మందికి సౌదీ ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. 2020, 2021 కంటే ఈ సంఖ్య ఎక్కువ.2018లో మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మరణశిక్షలను వీలైనంత వరకు తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. నరహత్యలకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్ష విధిస్తామని అన్నారు. అయితే, ఇప్పుడు అందుకు భిన్నంగా డ్రగ్స్ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మరణశిక్ష విధించడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.