ఉత్తర భారతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వానతో ఆ రాష్ట్రాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పిడుగుపాటుకు ఉత్తరాదిన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్‌లో పిడుగుపాటుకు గురై ఒక్కరోజే 20 మంది మరణించగా.. యూపీలో గత రెండ్రోజుల్లో 18 మంది.. ఝార్ఖండ్‌లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 8 జిల్లాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క కైమూర్ జిల్లాలోనే అత్యధికంగా ఏడుగురు మరణించగా.. భోజ్‌పుర్, పట్నాలో నలుగురు చొప్పున, జహనాబాద్, అర్వాల్, రోహ్తాష్, సివాన్, ఔరంగాబాద్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు గురై మొత్తం 18 మంది మృతి చెందారు. ఒక్క మంగళవారం రోజే 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. కౌశాంబిలో ఏడుగురు, ప్రయాగ్‌రాజ్‌లో అయిదుగురు, ఘాజీపూర్‌లో నలుగురు, భదోహిలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు.
ఝార్ఖండ్ పలామూలోనూ ఇద్దరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పొలంలో పశువులను మేపుతుండగా.. పిడుగులు సంభవించి బల్రాం యాదవ్(56), మాన్మతి దేవి(45) అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు.