సాధారణంగా మన పంటిలో ఏదైనా ఇరుక్కుంటే అది తీసేంత వరకు మనకు మనస్సు మనస్సులో ఉండదు. అలాంటిది ఒక పురుగు లాంటి జీవి శరీరంలోకి వెళ్లి ఏకంగా 17 సంవత్సరాలు ఉంటే ఆ మనిషి బాధ వర్ణానాతీతం. తాజాగా చైనా డాక్టర్లు ఒక యువకుడు 17 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధకు పరిష్కారం చూపించారు. అతని మెదడులో నివాసం ఉంటున్న 5 అంగుళాల పొడవైన వార్మ్ ను తొలగించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సంవత్సరాలు మెదడులో వార్మ్ ఉందని తెలిసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతయింది. ఆరేళ వయస్సు ఉన్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలోకి వార్మ్ ప్రవేశించింది. అప్పటినుంచి ఆ వ్యక్తికి శరీరంలోని పలు భాగాల్లో స్పర్శ తెలిసేది కాదు. ఆ వ్యక్తి పూర్వీకుల్లో కూడా ఆ సమస్య ఉండటంతో అతని తల్లిదండ్రులు ఆ సమస్య జన్యుపరంగా వచ్చిందని భావించారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ సమస్య మరింత తీవ్రమైంది.
ఐదేళ్ల క్రితం అతని శరీరంలోని సగ భాగంలో స్పర్శ జ్ఞానం లోపించింది. దీంతో యువకుడు, అతని తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెంటనే డాక్టర్లను సంప్రదించగా వాళ్లు పరీక్షలు చేసి అసలు విషయం బయటపెట్టారు. పరీక్షల్లో యువకుడి మెదడులో వార్మ్ ఉందని వార్మ్ ను తొలగిస్తే మాత్రమే యువకుడు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు వివరించి వారి అనుమతితో వార్మ్ ను తొలగించారు. ఆపరెషన్ అనంతరం యువకుడు సాధారణ స్థితికి చేరుకున్నాడు.