కొంత మంది ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.తాము ప్రజలకు అన్నీ ఇస్తున్నాము అని చెప్పుకునే ప్రభుత్వాలు సాధించిన విజయాలు క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనపడవు. తమ జీవన విధానం ఎప్పటికి మెరుగుపడకపోవడం, తమ బతుకులు ఇలాగే తెల్లారిపోతాయేమో అనే భయంతో చాలా మంది అర్ధంతరంగా తను చాలిస్తూ ఉంటారు. రాజకీయంగా, వ్యాపారంగా ఎంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ప్రపంచం, ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎన్నికలప్పుడే చేస్తూ ఉంటుంది.
తాజాగా పాకిస్తాన్ లో ని థార్ ఎడారి ప్రాంత౦లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. థార్ ఎడారి ప్రాంతంలో అన్ని దొరుకుతున్నా ఒక ప్రాంతంలో మాత్రం ప్రజల జీవితం దారుణంగా ఉంది. వారి పేదరికం రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనికి కారణం… అక్కడ బొగ్గు గనుల కారణంగా… ఉన్న ప్రజలను ప్రభుత్వాలు నిర్వాసితులను చేస్తున్నాయి. దీనితో పంటలు వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పచ్చని పంట పొలాల మీద అధికారులు కన్నేసి వాటిని బొగ్గు గనులకు వినియోగిస్తూ ఉంటారు.
దీనితో ఎక్కడికి వెళ్లి బ్రతకలేక… అక్కడ ఉండలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 59 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, వీరిలో 38 మంది మహిళలని, ఇద్దరు చిన్నారులని ఒక నివేదిక పేర్కొంది. గత ఏడాది అయితే అక్కడ దాదాపు 200 మంది ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 112 మంది మహిళలే అనే విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఇద్దరు తోటి కోడళ్ళు తమ పిల్లలతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇక్కడ చనిపోతున్న వారిలో ఎక్కువగా హిందువులే ఉన్నారు.