ఓవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్గు గట్టి దెబ్బ తగిలింది. ఆత్మాహుతి దాడిలో ఆ దేశంలో 61 మంది దుర్మరణం చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ పెషావర్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఓ మసీదులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ముందు వరుసలో కుర్చున్నాడని.. మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో తనను తాను పేల్చుకున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 61 మంది చనిపోగా.. సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే క్షతగాత్రుల్లో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
తెహ్రీక్-ఇ-తాలిబన్ (టీటీపీ) ఈ దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో హతమైన తన సోదరుడి మృతికి ప్రతీకారంగా తాజా దాడి చేసినట్లు టీటీపీ కమాండర్ ఉమర్ ఖలీద్ ఖురసాని తెలిపాడు. పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో 300 నుంచి 400 మంది పోలీసు అధికారులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు.