80 ఏళ్ల వ‌య‌స్సులోనూ పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు.. గ్రేట్‌..!

-

నేర్చుకోవ‌డానికి.. నేర్పించ‌డానికి.. నిజంగా వ‌య‌స్సు అనేది అడ్డంకి కాదు. అవును.. స‌రిగ్గా ఈ విష‌యాన్ని నమ్మింది కాబ‌ట్టే ఆమె 80 ఏళ్ల వ‌య‌స్సులోనూ పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతోంది. అది కూడా స్కూల్‌లో కాదు.. ఆన్‌లైన్‌లో.. క‌రోనా కార‌ణంగా స్కూళ్ల‌కు వెళ్ల‌లేక‌పోతున్న పిల్ల‌ల‌కు ఆమె ఆన్‌లైన్‌లో ఉచితంగా పాఠాలు చెబుతోంది. మార్చి నెల‌ నుంచే ఆమె అలా చేస్తోంది. ఆమే.. అంబుజా అయ్య‌ర్‌..

అంబుజా అయ్య‌ర్ వ‌య‌స్సు 80 ఏళ్లు.. అంటే రిటైర్మెంట్ ఏజ్ దాటాక సుమారుగా 20 ఏళ్లు అన్న‌మాట‌. ఆ వ‌య‌స్సులో సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే స‌త్తువ న‌శిస్తుంది. అందువ‌ల్ల ఎక్కువ స‌మ‌యం పాటు ఇంట్లోనే ఉంటారు. త‌మ శేష జీవితాన్ని సుఖ సంతోషాల‌తో గ‌డ‌పాల‌ని చూస్తారు. కానీ అయ్య‌ర్ మాత్రం పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆమె స్వ‌త‌హాగా మ్యాథ్స్ టీచ‌ర్‌. అందువ‌ల్ల ఆమె మార్చి నెల నుంచి క‌రోనా కార‌ణంగా స్కూళ్ల‌కు వెళ్ల‌లేక‌పోతున్న పిల్ల‌ల‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోంది. త‌న‌కంటూ సొంతంగా ఓ వెబ్‌ప్లాట్‌ఫాం అకౌంట్ కూడా ఉంది. అలాగే యూట్యూబ్ చాన‌ల్ ఉంది. వాటి ద్వారా ఆమె మ‌న దేశంలో ఉన్న పిల్ల‌ల‌కే కాదు.. యూఏఈ, యూఎస్ఏ, యూకే, ఇండోనేషియాల‌లో ఉన్న పిల్ల‌ల‌కు కూడా ఆన్‌లైన్‌లో గ‌ణిత పాఠాలు బోధిస్తోంది.

అయ్య‌ర్ నిజానికి గ‌త 50 ఏళ్లుగా గ‌ణిత శాస్త్ర టీచ‌ర్‌గా ప‌నిచేస్తూనే ఉంది. ఆమె ఎప్పుడూ త‌న వృత్తిలో విరామం తీసుకోలేదు. స్కూల్స్ లేక‌పోయినా ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వేల మంది విద్యార్థుల‌కు గ‌ణిత పాఠాలు చెప్పింది. గ‌ణిత‌మంటే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే భ‌యం ఉంటుంది. కానీ అయ్య‌ర్‌.. ఆ భ‌యాన్ని పోగొడుతోంది. అందుకు ఆమె సుల‌భంగా గ‌ణిత శాస్త్రాన్ని నేర్చుకునే సూచ‌న‌ల‌ను ఆమె విద్యార్థుల‌కు చెబుతోంది. ఇక నిత్యం ఆమె 5 గంట‌ల పాటు నోట్స్ ప్రిపేర్ చేస్తుంది. దాన్ని కంప్యూట‌ర్‌లోకి ఓ టైపిస్టు ద్వారా ఎంట్రీ చేస్తుంది. అనంత‌రం దాంతో పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతుంది.

అలాగే అయ్య‌ర్ 200 మంది టీచ‌ర్ల‌తో ఓ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టింది. వారితో నిత్యం టచ్‌లో ఉంటూ వారిని కూడా ఆన్‌లైన్‌లో పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే విధంగా ప్రోత్స‌హిస్తోంది. అయ్య‌ర్‌తోపాటు ఇత‌ర టీచ‌ర్లంద‌రూ 6 నుంచి 10వ త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నారు. ఈ వ‌య‌స్సులో కూడా ఇంత క‌ష్ట‌ప‌డ‌డం ఎందుకు అని ఆమెను అడిగితే.. పిల్ల‌ల‌కు గ‌ణితం అంటే ఉండే భ‌యాన్ని పోగొట్ట‌డంతోపాటు.. క‌రోనా స‌మ‌యంలో వారికి ఏదో ఒక‌టి చేయాల‌నిపించింద‌ని.. అందుక‌నే ఇలా పాఠాలు చెబుతున్నాన‌ని తెలిపింది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version