తన ఏడాదిన్నర బాబు ఆటలో బిజీ అయ్యాడని భావించిన ఆ తల్లి ఇంటి పని చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి ఆన్ చేసింది. ఆ తర్వాత వంట పని చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది. కాసేపటి తర్వాత బాబు గోల వినిపించకపోయేసరికి ఎక్కడున్నాడా అని చూసింది. ఇళ్లంతా వెతికినా కనిపించలేదు. వాషింగ్ మెషీన్ నుంచి విచిత్రమైన శబ్ధం రావడంతో తెరిచి చూడగా అందులో కనిపించాడు. ఆ తర్వాత ఏమైందంటే..?
దిల్లీలోని వసంత్ కుంజ్‌కు చెందిన ఓ మహిళ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్ చేసి వెళ్లింది. అక్కడే ఆడుకుంటున్న ఆమె బాబు కాసేపటికి కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్ మెషిన్‌లో నుంచి సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూసేసరికి అందులో కనిపించాడు. ఒక్కసారిగా కంగుతిన్న ఆమె వెంటనే బాబును ఆస్పత్రికి తరలించింది.
హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఆ చిన్నారి దాదాపు ఏడురోజులు కోమాలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అనంతరం 12 రోజులు వార్డులో ఉండి చికిత్స పొందాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే కుర్చీ సాయంతో వాషింగ్ మెషిన్‌పైకి తమ కుమారుడు ఎక్కి ఉండవచ్చని చిన్నారి తల్లి భావించింది. ఈ ప్రమాదం నుంచి చిన్నారి కోలుకోవడం అద్భుతమని వైద్యులు అన్నారు.