రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన ఖమ్మంలోని ఐలాపురం వద్ద శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒరిస్సాకు చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్నది.
ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీని బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన టైంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రవి ఆధ్వర్యంలోని పోలీసుల బృందం క్షతగాత్రులను చికిత్స కోసం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.