దేవాదాయ చట్ట సవరణ బిల్లు పై మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. 18 మంది సభ్యులతో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఉంటుందని.. వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలుగా ఉంటుందని తెలిపారు. బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని.. డీఏలు మాత్రం ఉంటాయని తెలిపారు.
ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని వెల్లడించారు. బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని.. బోర్డు ఆధ్వర్యంలోనే యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి నిర్వహించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాస్ట్రంలోని దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు. గతంలో యాదగిరిగుట్టలో సాధారణ భక్తులకు సరైన సదుపాయాలు లేవని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోట్లు ఖర్చు చేసి వసతులు ఏర్పాటు చేసిందన్నారు.