ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రణరంగంలా మారాయి. వరుసగా టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇరు పార్టీల నడుమ వైరం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదవుతుండగా.. ఇప్పుడు నారా లోకేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆయనపై ఎందుకు కేసు నమోదైందంటే.. కర్ణాటక రాష్ట్రంలో రాయదుర్గంకు చెందిన టీడీపీ కార్యకర్త మారుతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కాగా ఈ దాడి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేయించారంటూ లోకేష్ ట్విట్టర్ లో ఆరోపించారు.
దీంతో ఎమ్మెల్యేను బెదిరిస్తూ.. అసత్యపు ఆరోపణలు చేశారంటే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.అటు చంద్రబాబుపై కూడా కొత్త రకం కరోనా వేరియంట్ విషయంలో అబద్దపు ప్రచారం చేశారంటూ కేసు నమోదైంది. టీడీపీ నేతలపై వరుస కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఈ కేసులపై లోకేష్ ఇంకా స్పందించలేదు.