తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల సమస్యలు మాత్రం మారడం లేదు. కొంత మంది రైతులు పట్టాలు కాకపోవడం.. మరికొంత మంది రైతులకు పట్టాలు అయినప్పటికీ వారి చేతికి పాస్ బుక్ లు ఇవ్వకపోవడం ఇలా ఏదో ఒక సమస్యతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం పట్టనట్టే వ్యవహరించడం గమనార్హం.
తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్ పైకెక్కి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన భూ వివాదం సమస్య పరిష్కరించడం లేదని కలెక్టర్ కార్యాలయం పైకెక్కి పురుగుల మందు తాగాడు రైతు నర్సయ్య. తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడిది జనగామ మండలం పసరమడ్ల గ్రామం..ఆత్మహత్యాయత్నం చేసుకున్న నర్సయ్యను జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు.