సిరిసిల్లలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం మనోజ్ఞ (4) మహర్షి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.ఉదయం స్కూల్ ఆవరణలో చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా.. డ్రైవర్ పాపను గమనించకుండానే వ్యాన్‌ను రివర్స్ తీశాడు.
అయితే, ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ వచ్చి పాపను ఢీకొట్టింది. అంతేకాకుండా ఆమె తలపైకి వ్యాన్ టైర్లు వెళ్లడంతో తల ఛిద్రమైంది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. తమ కూతురు మరణాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాఠశాల హెడ్ విదేశాల్లో ఉండి ఇక్కడి పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి అనార్థం జరిగిందని మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని,బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి.దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.