పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆక్రోపోలిస్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బహుళ అంతస్తుల భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం కలకలం రేపింది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోర్‌లో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఆ పొగ బయటికి వెళ్లడం కోసం అద్దాలను పగులగొట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశామని, ప్రమాదంలో జరిగిన నష్టం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని జాదవ్‌పూర్ డివిజన్ డీసీపీ కలితాదాస్ గుప్తా చెప్పారు.