రాష్ట్రంలో ఉన్నట్టుండి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న రాత్రి హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కోసం ఏర్పాటు చేసిన ఎలివేషన్ రాడ్స్ కట్టడం కుప్పకూలింది.
ఓ ఎలక్ట్రానిక్ షో రూమ్ ఎలివేషన్ పనుల కోసం దీనిని నిర్మించారు. నిన్న రాత్రి భారీగా గాలులు వీచడంతో రాడ్లతో నిర్మించిన కట్టడం కూలింది. ఈ ఘటన సీఎం నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. అప్పటి వరకు అక్కడ 30 మంది కార్మికులు పని చేస్తున్నారని, వర్షం కారణంగా వారంతా లోపలికి వెళ్లగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన ఐరన్ రాడ్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.