తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో లొంగిపోయిన ఏ9, ఏ10

-

ఖ‌మ్మం జిల్లా తెల్దారుప‌ల్లిలో గత నెల 15న హత్యకు గురైన త‌మ్మినేని కృష్ణయ్య కేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. ఏ9, ఏ10 నిందితులు తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్యలు ఖమ్మం జిల్లా రెండో అదనపు జడ్జి ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులు రిమాండ్‌లో ఉండగా.. వీరితో కలిసి 10 మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

హత్య ఎలా జరిగిందంటే.. ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య (62) సోమవారం దారుణహత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తెల్దారుపల్లి సమీపంలో.. వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కన కాలువలో పడిపోయారు.

దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కత్తులతో నరకడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్య టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి కుమారుడు నవీన్‌, కుమార్తె రజిత ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version