తన కూతురికే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు.. ఎల్జీపై కేజ్రీవాల్ ఆరోపణలు

-

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి మధ్య చాలా రోజులుగా విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్​) డిమాండ్‌ చేసింది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది.

ఓ కాంట్రాక్ట్‌ను సక్సెనా.. తన కుమార్తెకే కేటాయించారని ఆరోపణలు చేసింది. వెంటనే ఆయన్ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం (రాజ్‌ నివాస్‌) వెంటనే స్పందించింది. ఖాదీ లాంజ్‌ ఇంటీరియల్‌ డిజైన్‌ను సక్సేనా కుమార్తె చేసిన మాట వాస్తవమే అయినా ఉచితంగా చేశారని పేర్కొంది. దీనివల్ల కేవీఐసీకి లక్షల రూపాయలు మిగిలాయని తెలిపారు. ఈ విషయంలో టెండర్‌ ఆహ్వానించడం గానీ, కేటాయించడం గానీ జరగలేదని పేర్కొంది. దీనిపై సంజయ్‌ సింగ్‌ కూడా వెంటనే స్పందించారు. సొంత కుటుంబ సభ్యులకు ఎలాంటి కాంట్రాక్ట్‌ గానీ, పని గానీ అప్పగించకూడదని కేవీఐసీ స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు.

‘మా పార్టీలో ఒక నేత కంప్యూటర్‌ ఇంజినీర్‌ ఉన్నారు. ఉచితంగా చేస్తానంటే ఆయనకు సెంట్రల్‌ విస్తా ఐటీ వర్క్‌ అప్పగిస్తారా? ఇంకొకరు ఎంబీఏ చదివారు. ఉచితంగా చేస్తానంటే ఆయనకు ప్రధాని కార్యాలయంలో మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు అప్పగిస్తారా?’ అని ప్రశ్నించారు. పైగా సక్సేనా కుమార్తెకు వృత్తి పరంగా లబ్ధి చేకూర్చేందుకు ఆవిష్కార ఫలకంపై ఆమె పేరు కూడా ముద్రించారని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version