దేశ వ్యాప్తంగా అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులపై ఏసీబీ కన్నువేసింది. దీంతో తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి వైద్య వరప్రసాద్ ఏసీబీకి చిక్కారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వరప్రసాద్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈయన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో వరప్రసాద్, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది. వరప్రసాద్ పై ఫిర్యాదులు అందడంతో, అంతర్గత విచారణ జరిపిన హైకోర్టు.. వరప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఖరారు చేసుకున్న తరవాతే ఈ కేసును ఏసీబీకి అప్పగించిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా, క్రైం నెంబరు 25/ఏసీబీ-ఆర్‌ఏసీ-సీఆర్2/2018లో 1988 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి) రెడ్‌విత్ 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.