అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాల పై దాడే అని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు జగన్ కి అయ్యన్న కుటుంబ చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు.
అయ్యన్న పాత్రుడు కావలసిన అన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారమే ఇంటిని నిర్మించారని అన్నారు. బలహీన వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడు కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అర్ధరాత్రి ఇంటిని కూల్చడానికంటే నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 300 ఏ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. అసలు ఐపీఎస్ అధికారి మణికంఠ కు చట్టాలు తెలుసా? అని ప్రశ్నించారు. ఐపీఎస్ మణికంఠ తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో ఉంటారు.. వారి ఇంటి అర్ధరాత్రివేళ జెసిబి లతో పోలిస్తే బాధగా ఉండదా? ఈ పరిస్థితి వారికి వస్తే వారు ఎంత బాధపడతారో మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తానని అన్నారు అచ్చెన్నాయుడు.